Ambati Rambabu: చిరంజీవి గారూ, మీ ఇంట్లో వివాదాలు లేవా?... మీ తమ్ముడికి చెప్పండి: అంబటి రాంబాబు

  • సంచలన వీడియో విడుదల చేసిన మంత్రి అంబటి అల్లుడు డాక్టర్ గౌతమ్
  • ఈ వీడియో వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడంటున్న మంత్రి అంబటి
  • ఎవరి కుటుంబాల్లో గొడవలు లేవు? అంటూ వ్యాఖ్యలు
  • మరీ ఇంత నీచానికి దిగజారాలా? అంటూ ఫైర్
Ambati Rambabu take a dig at Pawan Kalyan over his son in law video issue

మంత్రి, సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు ఓటేయొద్దంటూ ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఓ వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టించింది. అంబటి రాంబాబు ఓ నీచుడు అంటూ గౌతమ్ వీడియోలో పేర్కొనడం తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ వీడియోపై మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. 

"ఈ నెల 13న పోలింగ్ జరగనుండగా, ఇవాళ ఐదో తారీఖున మా అల్లుడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నేనొక దుర్మార్గుడ్ని అని, నేనొక దుష్టుడ్ని అని, నాకు ఓటు వేయొద్దని చెప్పాడు. అతడేదో వ్యాఖ్యలు చేశాడు... నేను పెద్దగా పట్టించుకోలేదు... ఎందుకంటే అతడేమీ రాజకీయ నాయకుడు కాదు. నా కూతురు మనోజ్ఞ కూడా రాజకీయ నాయకురాలు కాదు... ఆమె కూడా ఓ డాక్టర్. 

కానీ ఇప్పుడు నేను దీనిపై ఎందుకు మాట్లాడుతున్నానంటే... ఈ వీడియో అంశాన్ని పవన్ కల్యాణ్ పొన్నూరులో ప్రస్తావించారు. మా అల్లుడు గౌతమ్, నా కుమార్తె విడాకులు తీసుకుంటున్నారు. ఆ ప్రక్రియ నడుస్తోంది. గతంలో కూడా గౌతమ్... నేను పవన్ కల్యాణ్ ను కలుస్తాను, నేను చంద్రబాబును కలుస్తాను అని మా అమ్మాయితో అనేవాడు. 

విడాకులు ఇవ్వడానికి నా కూతురుకేమీ అభ్యంతరం లేదు... అయితే ఆమెకు పిల్లలున్నారు... వారి భవిష్యత్తు ఏమిటో తేలాలి కదా. ఈ విషయంలోనే కోర్టులో మేం న్యాయపోరాటం చేస్తున్నాం. ఇది మా కుటుంబ విషయం. బయటివారికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కూతురుకు సంబంధించిన విషయం కాబట్టి బహిర్గతం చేయాలని ఏ తల్లిదండ్రులు అనుకోరు. 

నాలుగేళ్ల కిందట అతడు నా కూతురిని అర్ధంతరంగా వదిలేస్తే... నా కూతురిని సంరక్షించుకుంటున్న వ్యక్తిని నేను. నా కూతురినే కాదు... గౌతమ్ కూతురిని, కొడుకును కూడా సంరక్షిస్తున్నాను. ఈ క్రమంలో నేను దుర్మార్గుడ్ని అంటూ అల్లుడు వీడియో విడుదల చేశాడు. నా కూతుర్ని వదిలేసిన అల్లుడే దుర్మార్గుడు... తన కూతురిని, కొడుకును కూడా వదిలేసిన అతడే దుర్మార్గుడు... నేనెలా దుర్మార్గుడ్ని అవుతాను? 

ఇవాళ నా అల్లుడు మాత్రమే మాట్లాడితే నేను అస్సలు  మాట్లాడేవాడ్ని కాదు... కానీ నా అల్లుడి మాటల వెనుక పవన్ కల్యాణ్ ఉన్నాడు. పవన్ కల్యాణే అతడితో మాట్లాడించాడు, చంద్రబాబు అందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఏబీఎన్, టీవీ5 దీన్ని పదే పదే ప్రసారం చేస్తున్నాయి. ఇది దుర్మార్గం కాదా? ఒక కుటుంబ విషయాన్ని ఇంత తీవ్రస్థాయిలో రచ్చకీడ్చి రాజకీయ లబ్ధి పొందడాన్ని ఏమనాలి? అదీ నా ఆవేదన! 

నేను సత్తెనపల్లిలో గెలవబోతున్నానని తెలిసిన తర్వాత ఇలాంటి చవకబారు ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణ, నన్ను ఓడించాలనుకుంటున్న పవన్ కల్యాణ్, నన్ను అసెంబ్లీకి రానివ్వకూడదనుకుంటున్న చంద్రబాబునాయుడు కలిసికట్టుగా ఆడుతున్న నాటకం కాదా ఇది? మా అల్లుడేమో వీడియోలో మాట్లాడతాడు... ఏబీఎన్ లోనూ, టీవీ5లోనూ ఆ వీడియో వేస్తారు... పవన్ కల్యాణేమో పొన్నూరు వచ్చి మాట్లాడతాడు... ఇది ధర్మమేనా అని ప్రజలు ఆలోచించాలి. నా ఓటర్లు కాదు... ప్రజలందరూ ఆలోచించాలి. నా ఓటర్లకు నేనేంటో తెలుసు.

నేను కూడా ఇలాగే మాట్లాడదలచుకుంటే...! ఎవరి కుటుంబంలో గొడవలు లేవు? చిరంజీవి గారూ... మీ తమ్ముడికి చెప్పండి... మీ కుటుంబంలో గొడవలు లేవా? మీ కూతురికి సంబంధించి వివాదాలు లేవా? నాగబాబు గారూ... మీ కుటుంబంలో గొడవలు లేవా? మీ కూతురికి సంబంధించి వివాదాలు లేవా? అక్కడిదాకా ఎందుకు... నా ప్రత్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు ఇద్దరు కుమారులు... మీకు వివాదాలు లేవా? మీరు కోర్టులకు పోలేదా? 

మరీ ఇంత నీచానికి దిగజారాలా? మా అల్లుడితో వీడియో పోస్టు చేయిస్తారా? జై కన్నా అనిపించి ఆ వీడియోను సర్క్యులేట్ చేస్తారా? నేను దుర్మార్గం చేయలేదు... నా కూతుర్ని కాపాడుకుంటున్నాను. భర్త లేకపోయినా తన కాళ్ల మీద తాను నిలబడగలిగేలా ఆమెను తీర్చిదిద్దుతున్నా" అంటూ అంబటి రాంబాబు వివరించారు.

  • Loading...

More Telugu News